ప్రపంచంపై కరోనా మరోసారి కోరలు చాస్తోంది. ముఖ్యంగా భారత్‌లో గత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో 24 గంటల్లో 7వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి తాజాగా సుప్రీం కోర్టును తాకింది.
సుప్రీం కోర్టులో తాజాగా కరోనా కలకలం రేపింది. గత రెండ్రోజులుగా కొందరు న్యాయమూర్తులు, న్యాయవాదులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో సుప్రీం కోర్టు, పరిసరాల్లో వెంటనే కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అందరూ తప్పక మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు దేశంలో ప్రస్తుతం 65,683 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొవిడ్ కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 (XBB.1.16) వేరియంట్ కారణమని వైద్య నిపుణులు తెలిపారు. అయితే, కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఈ వేరియంట్ మరీ అంత శక్తిమంతమైనది ఏమీ కాదని పేర్కొన్నారు.