దళిత విద్యార్థిని చితకబాదిన టీచర్.. చికిత్స పొందుతూ బాలుడి మృతి

-

ఇటీవల దళిత విద్యార్థులపై టీచర్ల దాష్టీకం ఎక్కువవుతోంది. చిన్న చిన్న కారణాలతో వారిని చితకబాది వారిని మరణం అంచుల దాకా తీసుకెళ్తున్నారు. కొన్నిసార్లు టీచర్ల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న విద్యార్థులు తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరయలో జరిగింది. పరీక్షలో ఓ పదం తప్పు రాశాడని దళిత విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. తీవ్రగాయాలపాలైన విద్యార్థి 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అచల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ స్కూల్ లో వైషోలి గ్రామానికి చెందిన నిఖిత్ కుమార్ (15).. పదో తరగతి చదువుతున్నాడు.  సెప్టెంబరు 7న కళాశాలలో సైన్స్ టీచర్ అశ్వనీ సింగ్.. ఓ పరీక్ష నిర్వహించాడు. ఆ ఎగ్జామ్​లో ఒక పదం తప్పు రాసినందుకు అశ్వనీ సింగ్.. నిఖిత్​ను జుట్టు పట్టుకుని కర్రతో దారుణంగా కొట్టాడు. దీంతో నిఖిత్ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు.

విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబసభ్యులు కాలేజీకి చేరుకుని అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం లఖ్​నవూ తీసుకెళ్లమని వైద్యులు సూచించారు.అక్కడికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ నిఖిత్ సోమవారం​ మరణించాడు. మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news