ఆ హత్య నన్ను షాక్ కి గురిచేసింది: కేటీఆర్

రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగిన దారుణ హత్య తీవ్ర సంచలనం రేపింది. నుపూర్ శర్మ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు టైలర్ దుకాణంలోకి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కొలతలు తీసుకుంటున్న టైలర్ ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తర్వాత ఉదయపూర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు.

ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రూరమైన హత్య వెనుక ఉన్న కారణం తనను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక హింసకు సమాజంలో చోటు లేదన్నారు. క్రూరమైన హత్యలకు పాల్పడి నేరస్థులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష విధించాలి అని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.