తమిళనాడు లో తొలివిడుత సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ పై సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామనాథపురం, తేనిలలో జరిగిన సభలో మోడీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు ఉదయనిధి.
కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతీ రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని.. అందుకే 28 ప్రధాని అని విమర్శించారు. ఎన్నికలు ఉన్నప్పుడే ఈ ప్రధానికి తమిళనాడు గుర్తుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందన్నారు. నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ తీసుకొచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్ ని కేంద్రం నాశనం చేస్తుందన్నారు. నీట్ పై నిషేదంతో ప్రతీ అంశంలో కూడా తమిళనాడు పై ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నారని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడులో ఉన్న 39 పార్లమెంట్ స్థానాలకు తొలిదశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగనుంది.