ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేతతో లో విధ్వంసాలకు పునాది వేసి నేటికి రెండేళ్ళు అవుతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో సీఎం జగన్ తన పాలనా స్వభావాన్ని ప్రజలకు తెలియజెప్పాడని విమర్శించారు. జగన్ ప్రభుత్వం కూల్చివేతలే తప్ప కట్టింది ఒక్కటీ లేదని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తిరోగమన బాట పట్టాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల వాక్ స్వాతంత్రాన్ని, హక్కులను కాల రాస్తున్నారని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ తండ్రి అయిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో పాటు గతంలో ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రులందరూ ఎంతో కొంత ప్రజలకు మేలు చేశారే తప్ప.. రాష్ట్రాన్ని ఈ విధంగా తిరోగమన బాట పట్టించలేదని వ్యాఖ్యానించారు. రెండేళ్ళలోనే ఇలా ఉంటే రాబోయే మూడేళ్ళలో రాష్ట్రం ఎలా ఉంటుందో! అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు.