తెలంగాణ ఉద్యోగుల్లో మళ్లీ కొత్త పంచాయితీ

-

తెలంగాణ ఉద్యోగుల్లో మళ్లీ కొత్త పంచాయితీ మొదలైంది.నూతన సంవత్సర కానుకగా పీఆర్సీ ఉంటుందని అనుకున్నారు తెలంగాణ ఉద్యోగులు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లింది ప్రభుత్వం. కమిటీ నివేదిక ఇవ్వగానే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు… ఆ వెంటనే అన్నీ చక చక అయిపోతాయని సర్కార్‌ చెప్పింది. కమిటీ నివేదికైతే ఇచ్చింది కానీ.. అందులోని అంశాలు ఇంకా పబ్లిక్ డొమైన్‌లోకి రాలేదు ఇప్పుడిదే అంశం తెలంగాణ ఉద్యోగులతో కొత్త పంచాయితీకి కారణమైంది.


పీఆర్సీ నివేదిక వెల్లడించాలని.. వెంటనే చర్చలు ప్రారంభించాలనే డిమాండ్‌తో ఆందోళనకు సిద్ధమవుతోంది ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక. ఈ నెల 23న నిరాహారదీక్షకు రెడీ అవుతోంది. ఉద్యోగుల డిమాండ్‌ ఎలా ఉన్నా.. పీఆర్సీ నివేదిక ఇచ్చి 15 రోజులైనా అందులోని వివరాలను ఎందుకు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచలేదు? మొదటి వారంలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చిస్తానని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఈ ప్రశ్నలకు అటు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.. ఇటు ఉద్యోగ సంఘాలలో ఆందోళన పెరిగిపోతోంది.

ప్రభుత్వానికి పీఆర్సీ ఏం చెప్పిందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏం అడగాలన్నా క్లారిటీ లేకుండా పోయిందన్నది ఉద్యోగులు చెప్పేమాట. ఇతర ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఉద్యమంపై సానుకూల స్పందన వస్తోందట. అయితే ప్రభుత్వం వేసిన కమిటీలోని సభ్యులు కరోనా వ్యాక్సినేషన్‌ పనుల్లో ఉండటంతో.. అది కూడా ఆలస్యానికి ఒక కారణంగా చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ నిరంతర ప్రక్రియ. అది గాడిలో పడేంత వరకు అధికారులు బిజీగానే ఉన్నారు. మరి వారికి ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఎప్పుడు సమావేశం అవుతారో మిస్టరీగానే ఉంది.

ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వత్తసు పలుకుతున్నాయని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టీఎన్జీవోలు ఉద్యోగుల సమస్యలపై పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా యూనిట్ల నుంచి కూడా ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఒకవైపు రాజకీయ విమర్శలు.. మరోవైపు తోటి ఉద్యోగ సంఘాల కామెంట్స్‌తో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సంఘాల నాయకులు తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇన్నాళ్లూ ప్రభుత్వంపై నమ్మకం ఉందంటూ పనిచేయించుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు అనుకున్నారు. కానీ.. పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాట ప్రకారం సంప్రదింపులు చేయకపోవడంతో అండగా ఉండే సంఘాలు ఇరకాటంలో పడ్డాయి. పోరాటం చేయలేక పొరుగు సంఘాల నుంచి వచ్చే విమర్శలను జీర్ణించుకోలేక అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది ఉద్యోగ సంఘాల ప్రతినిధుల పరిస్థితి. ఇది ఉద్యోగ సంఘాల్లో వివాదానికి కారణమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news