తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల (new ration cards)పంపిణీ మరి కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే సోమవారం నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ముందుగా అధికారులు భావించినా.. దరఖాస్తుల పరిశీలన ఇంకా పూర్తి కాలేదు. దీంతో కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి మరింత సమయం పట్టనుంది. అయితే క్షేత్రస్థాయిలో సగం దరఖాస్తుల పరిశీలన కూడా కాలేదని తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసేందుకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో 4,46,169 మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హులకు వెంటనే కార్డులు మంజూరు చేయాలని జూన్ 8న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 15 రోజుల వ్యవధిలో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వ్యవహారాలను పరిశీలించేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా నియమించారు.