ఏపీలో గత ఎన్నికల్లో సునామి క్రియేట్ అయ్యింది. వైసీపీ ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మొత్తం 175 సీట్లలో 151 చోట్ల వైసీపీ గెలుపు అంటే అది మామూలు ప్రభంజనం కాదు. ఇక ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్లలో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే జగన్ చెంత చేరిపోయారు. అసలు చాలా మందికి కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి లేకపోయినా కూడా వాళ్లంతా జగన్ గాలిలో ఎమ్మెల్యేలు అయిపోయారు. దాదాపు 90 మంది వరకు ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా.. ప్రజల్లో పేరులేకపోయినా జగన్ దయతో అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చేశారు.
ఇప్పటికే యేడాదిన్నర పాలన పూర్తయ్యింది. ఏపీలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ? వారి పనితీరుపై ప్రజల్లో ఎలా ఉందని ఇప్పటికే రెండు సర్వేలు జరిగాయి. తాజాగా చెన్నైకు చెందిన ఓ సర్వే సంస్థ చేసిన సర్వేలో దిమ్మతిరిగిపోయేలా ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. మొత్తం వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో 87 మందిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. వీరిలో చాలా మంది జగన్ గాలిలో అయితే గెలిచారు కాని.. ప్రజలకు అసలేమాత్రం అందుబాటులో ఉండడం లేదట.
కొందరు వ్యాపారాలు చేసుకుంటూ నియోజకవర్గాలకు దూరంగా ఉంటే.. మరి కొందరు మాత్రం నిధులు లేవు.. నియోజకవర్గంలో తిరిగి మాత్రం ఏం లాభం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మరి కొందరు టీడీపీ నుంచి వస్తోన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ పాత వైసీపీ నేతలను విస్మరిస్తున్నారట. చాలా నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే ఎవరు ? అంటే ప్రజలు చెప్పలేని పరిస్థితి ఉందట. మరి కొందరు ఎమ్మెల్యేలను తాము ఇప్పటి వరకు చూడలేదని చెపుతున్నారట.
వైసీపీకి ఓట్లేసిన జగన్ వీరాభిమానుల నుంచే ఈ ఆన్సర్లు వస్తున్నాయంటే ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తున్నారో ? వారి పాలన ఎలా ? ఉందో అర్థమవుతోంది. కేవలం ఎమ్మెల్యేల మీద మాత్రమే కాదు..పది మంది మంత్రుల మీద కూడా ప్రజల్లోనూ, నియోజకవర్గాల్లోనూ వ్యతిరేకత ఉందని సర్వే చెప్పింది. అదే సమయంలో ఎమ్మెల్యేలకు వ్యతిరకంగా ఉన్నవారికి జగన్పై ఎంత మాత్రం ప్రేమ తగ్గలేదు. ఏదేమైనా జగన్ ఎమ్మెల్యేలను ఓ కంట కనిపెట్టకపోతే పుట్టిమునగడం ఖాయం..!
-Vuyyuru Subhash