కడప జిల్లా…ఈ జిల్లా పేరు చెబితే చాలు వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అని అందరికీ అర్ధమైపోతుంది. మొన్నటివరకు వైఎస్సార్ ఫ్యామిలీ కాంగ్రెస్‌లో ఉండటంతో జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది…ఇక వైఎస్సార్ మరణం…జగన్ వైసీపీ పెట్టాక జిల్లాలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కొనసాగుతుంది. 2014, 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీడే హవా. ఇక బద్వేలు నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
మొదట నుంచి బద్వేలులో కాంగ్రెస్ హవానే కొనసాగింది. ఇక ఇప్పటివరకు టిడిపి ఇక్కడ మూడు సార్లు మాత్రమే గెలిచింది. 1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది…1999 తర్వాత ఇక్కడ టిడిపి గెలిచిన దాఖలాలు లేవు. గత రెండు పర్యాయాలు అంటే 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతూ వస్తుంది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించడంతో బద్వేల్ ఉపఎన్నిక అనివార్యమైంది.
అక్టోబర్ 30న ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 2019 ఎన్నికల నుంచి రాష్ట్రంలో వైసీపీ హవా నడుస్తోంది…పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ వన్ సైడ్ గా విజయాలు దక్కించుకుంది. మరి మొదట నుంచి కంచుకోటగా ఉన్న బద్వేలులో వైసీపీ విజయం నల్లేరు మీద నడకే.
పైగా సానుభూతి కూడా వైసీపీకి వర్కౌట్ అవుతుంది. అసలు బద్వేలులో గెలవడానికి వైసీపీకి ప్రతి అంశం కలిసొస్తుంది. ఇక గత ఎన్నికల్లో వచ్చిన 44 వేల ఓట్ల మెజారిటీని ఉపఎన్నికలో క్రాస్ చేస్తామని వైసీపీ చెబుతోంది. దీంతో టిడిపి బద్వేలు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది. ఓటమిలో టిడిపికి ఊహించని ట్విస్ట్ ఎదురయ్యేలా ఉంది. ఇంతవరకు బద్వేలులో టిడిపి డిపాజిట్ కోల్పోలేదు. కానీ ఇప్పుడు పరిస్తితిని బట్టి చూస్తే టిడిపి డిపాజిట్ కోల్పోయి ఊహించని ఓటమి పాలయ్యేలా కనిపిస్తోంది.