తొలి రౌండ్‌లోనే తన పంచ్ పవర్ చూపెట్టిన నిఖత్‌

-

పంచ్‌ పవర్‌కు వేళయైంది. ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌నకు తెరలేచింది. 65 దేశాల నుంచి 300 మందికి పైగా బాక్సర్లు తమ సత్తాచాటేందుకు సై అంటున్నారు. ముచ్చటగా మూడోసారి భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీలో స్టార్‌ బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే.. గతేడాది ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం నెగ్గిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ క్రీడా ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. ప్రపంచ చాంపియన్ అయిన తొలి తెలుగు బాక్సర్ గా నిలిచిన ఆమె ఇప్పుడు తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది. స్వదేశంలో తాజా ఎడిషన్ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫేవరెట్ గా బరిలో దిగింది. ఢిల్లీలో గురువారం మొదలైన ఈ టోర్నీలో నిఖత్ అంచనాలను అందుకుంది.

తొలి రౌండ్ లోనే తన పంచ్ పవర్ చూపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌ నిఖత్ జరీన్‌ (50 కేజీ) తొలి రౌండ్‌లో అజర్‌ బైజాన్‌కు చెందిన అనఖనిమ్‌ ఇస్మాయిలోవాను చిత్తు చేసి తన టైటిల్ వేటను ఆరంభించింది. ఈ బౌట్ లో నిఖత్ జరీన్ పంచ్ ల ధాటికి ప్రత్యర్థి తట్టుకోలేకపోయింది. దాంతో, రెండో రౌండ్ మధ్యలోనే బౌట్ ను నిలిపివేసిన రిఫరీ నిఖత్ ను విజేతగా ప్రకటించాడు. సూపర్ పంచ్ తో హైదరాబాదీ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టింది.

 

Read more RELATED
Recommended to you

Latest news