ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు ఆపడం కోసం చేయాల్సిన ఆఖరి ప్రయత్నం కూడా అయిపోయిందని, చివరి నిమిషం వరకు ఎన్నికలు ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమ విజయం న్యాయానిదేనని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సంధర్భంగా న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, విధేయత ఉన్నాయని, రాజ్యాంగం చెప్పిందే ఎలక్షన్ కమిషన్ చేస్తుందన్నారు. ఈ వ్యవస్థ కొందరి చేతుల్లోనే ఉంటే నిర్లిప్తత వస్తుందన్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్న ఆయన ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వల్ల గ్రామాల్లో వర్గ విభేదాలు వస్తాయని తాను భావించటం లేదన్న ఆయన రాజ్యాంగం పంచాయతీలకు నిర్దిష్ట విధులు, నిధులు ఇస్తుంది కాబట్టే ఈ ఎన్నికలకు అంత ప్రాధాన్యం ఉందన్నారు.