ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత కసితో ఉన్నారో, అంతే స్థాయిలో ఆయన హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళకూడదు అనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ రెండు వ్యవస్థలకు మధ్య ఏర్పడిన వివాదం కారణంగా, ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ ప్రభావం కారణంగా, ఏపీలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో అయినా వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు నిర్వహించి తీరాలనే కసితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు.
దీనికి అనుగుణంగానే ఆయన ఏర్పాట్లు చేస్తూ వస్తున్నా, దానికి ప్రభుత్వం కానీ , అధికారులు కానీ తగిన విధంగా సహకరించడంలేదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి నిమ్మగడ్డ టిడిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు కనుసన్నల్లో ఆయన పని చేస్తున్నారని ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది అంటూ, వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల అధికారి హోదాలో నిమ్మగడ్డ ఏపీ చీఫ్ సెక్రటరీ కి లేఖలు రాస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలని కోరుతూ వస్తున్నారు . అలాగే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన లేఖలు రాస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అధికారులెవరు సహకరించే అవకాశం కనిపించడం లేదంటూ సి ఎస్ ప్రత్యుత్తరం రాస్తున్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెల 17న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్ లేఖ తో కలిపి నిమ్మగడ్డ సీఎస కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం జారీ చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ నెల 3న ఇచ్చిన తీర్పును ఆయన లేఖ కూడా జతచేశారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోసం ఎన్నికల సంఘం మూడు రోజులలో ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించినట్లుగా కోర్టు తీర్పు కాఫిని జత చేసినట్లు తెలుస్తోంది.
అలాగే ఎన్నికల సంఘం వినతికి వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన ఆర్థిక సహకారం తో పాటు, అన్ని విధాలుగా ను సహకరించాలని ఆర్థిక పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ని హైకోర్టు ఆదేశించినట్లు నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు డైరెక్షన్ పేరుతో నమోదు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని డైరెక్షన్ లో నిమ్మగడ్డ పేర్కొన్నారు.ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్క డా తగ్గేది లేదనే విధంగా నిమ్మగడ్డ సంకేతాలు ఇస్తున్నా, ప్రభుత్వం నుంచి కూడా అదే రకమైన అభిప్రాయం కలుగుతోంది.
ఒకవైపు లేఖలతో మద్దతు కోరుతూనే, మరోవైపు డిమాండ్ చేస్తూ నిమ్మగడ్డ లేఖలపై లేఖలు రాస్తున్నారు. అయినా, వైసీపీ ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో లేదు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లినా తమదే పైచేయి గా ఉండేలా ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
-Surya