ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నిర్ణయం రాజ్యంగబద్దమేనా ?

-

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలనుకుంటే.. అది ఎన్నికల కమిషనర్ బాధ్యత. కానీ ఎవరెలా పోయినా తాను పదవిలో ఉన్నప్పుడే ఎన్నికలు జరగాలనుకోవడం.. కచ్చితంగా బాధ్యతారాహిత్యమే. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడదే చేస్తున్నారు. ప్రభుత్వంతో తగవును కొని తెచ్చుకుంటున్నారు. ఎపీ స్థానిక ఎన్నికల పై నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు.. నిప్పుతో చెలగాటమాడుతున్నట్టుగా ఉంది. రాజ్యాంగ బద్ధంగా తనకు సంక్రమించిన అధికారాల్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

రాజ్యాంగ బద్ధ సంస్థలు దారితప్పితే.. సొంత అజెండాలు అమలు చేస్తే ఎలా ఉంటుందో… ఈ పరిస్థితి స్పష్టంగా చెబుతోంది. గవర్నర్, ఎన్నికల కమిషనర్ లాంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లో నిబద్ధత కలిగిన వ్యక్తుల్ని నియమిస్తారు. కానీ కొందరు వాటికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. రమేష్ కుమార్ వ్యవహారం కూడా అదే. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏపీలో ఉన్నది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఎవరో నామమినేట్ చేస్తే వచ్చిన సర్కారు కాదు. ప్రభుత్వానికి కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. వాటికి లోబడి చుట్టూ ఉన్న రాజ్యాంగబద్ధ వ్యవస్థలు పనిచేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి. సలహా ఇవ్వాలే తప్ప.. రోజూ ఓ షెడ్యూల్ ప్రకారం గొడవలు పెట్టుకోవడం.. వ్యవస్థల్ని స్తంభింపజేయడం సరికాదు.

పొలిటికల్ పార్టీలు రోజుకో మాట మాట్లాడటం, తమకు అనుకూలంగా మాట మార్చడం రాజకీయాల్లో సామాన్యంగా జరిగేదే. కానీ, జనం సొమ్ము తింటూ.. జనం కట్టే ట్యాక్స్‌లను జీతాలుగా తీసుకునే అధికారులు ఇలా హేతుబద్దత లేకుండా రోజుకో నిర్ణయం, పూటకో మాట మాట్లాడితే ఎలా..? వారు నిర్వహించే ఉన్నత స్థానాలకు విలువెక్కడ ఉంది..? ప్రజలకు వీళ్లపై గౌరవం ఎలా వస్తుంది..? వీళ్లకు పొలిటికల్ లీడర్లకు తేడా ఏముంది..? గత మార్చిలో కరోనా ఉందనే సాకుతో స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా వాయిదా వేసిన రమేష్ కుమార్.. ఇప్పుడు వ్యాక్సినేషన్ కు సర్వం సిద్ధమైన తరుణంలో.. ఎన్నికలు పెట్టాల్సిందేనని మంకు పట్టు పడుతున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్.. కేంద్ర ఎన్నికల కమిషన్ లా స్వతంత్ర వ్యవస్థే. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ ప్రకారం ఎన్నికల తేదీలు ప్రకటించేటప్పుడు కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సంప్రదిస్తుంది. వీలైనంత వరకు ప్రభుత్వం చెప్పిన తేదీల్లోనే ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ ఏపీ ఎన్నికల కమిషనర్ మాత్రం అలా అనుకోవడం లేదు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అని వాదిస్తున్నారే కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికీ బానిస కాదనే విషయం గుర్తించడం లేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం పనిచేయదు. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక మాత్రం.. ఆ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉండదు.

తాను ఎన్నికల కమిషనర్ కాబట్టి.. తాను చెప్పిందే వేదవాక్కు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా తన ఆదేశాలు పాటించాలని వితండ వాదం చేస్తున్నారు. ఎస్ఈసీ వాదన ఎక్కడా నిలబడదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు చెబుతున్నా ఆయన చెవికెక్కించుకోవడం లేదు. పైగా తనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా రమేష్ కుమార్ అంత బాధ్యత గల ఎన్నికల కమిషనర్ అయితే.. షెడ్యూల్ ప్రకారం ఏపీలో స్థానిక ఎన్నికలు ఎందుకు జరగాలనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం 2018లో ఎన్నికలు జరగాలి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి నిమ్మగడ్డ అప్పుడెందుకు ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయలేదనేది కీలకమైన ప్రశ్న.

ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ పదవీ కాలం పట్టుమని రెండు నెలలు కూడా లేదు. ఈ సమయం కూడా న్యాయపోరాటాలతోనే గడిచిపోయేలా ఉంది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా.. పదేపదే కోర్టుల చుట్టూ తిప్పి.. ఓ ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ఏం సాధించాలనుకుంటున్నారనేదే అసలు సిసలు ప్రశ్న.

Read more RELATED
Recommended to you

Latest news