బంగారం పై కేంద్రం కొత్త రూల్స్ అందుకేనా

-

భారతీయులకు బంగారమంటే పిచ్చి.. ధరలు భగ్గుమంటున్నా.. సరే సెంటిమెంట్‌ పేరుతో కొనేస్తారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న రెండో దేశం మనది..! అందుకే పసిడి లావాదేవీలు ఓ రేంజ్‌లో ఉంటాయ్‌..! అయితే మనీ లాండరింగ్‌ అరికట్టేందుకు పసిడి కొనుగోళ్లపై నిఘా పెట్టింది కేంద్రం. ఇప్పుడు మరోసారి నిబంధనలు మార్చేసింది..

దేశంలో ధరలు పెరిగినా.. గోల్డ్‌కి ఉన్న డిమాండ్‌ మాత్రం తగ్గదు. అక్షయ తృతీయ, పెళ్లిళ్లు, పండుగలు ఇలా వేడుక ఏదైనా సరే బంగారాన్ని కొనాల్సిందే..! పసిడి మనోళ్లకు ప్రీసియస్ మెటలే కాదు.. ఆస్తి కూడా..! ఈ వ్యాపారం రెండు లక్షల కోట్లకు పైగానే ఉంది. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలుస్తోంది. దేశ జీడీపీలో 7 శాతం వాటా జ్యూయలరీ రంగానిదే..! దీని మీదే ఆధారపడి దాదాపు 46 లక్షల మంది పని చేస్తున్నారు. మన దేశంలో తయారైన అభరణాలకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్‌ ఉంది.

పెద్దోళ్లకే కాదు.. పేదోడు కూడా అప్పు చేసి మరీ కొంటాడు. అందరికీ ఈ బంగారం కేవలం అభరణం మాత్రమే కాదు.. అవసరంగా మారిపోయింది. దేశంలో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం పసిడి అభరణాల చుట్టే తిరుగుతోంది. అయితే ప్రధాని మోడీ నోట్ల రద్దు తర్వాత.. బంగారం అమ్మకాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా మనీ లాండరింగ్‌ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్ర సర్కార్‌.. ప్రతి పైసాకు లెక్క కట్టాలని భావించింది. ముఖ్యంగా ఉగ్ర కార్యకలాపాలతో పాటు.. ఇతర సంఘ విద్రోహ కార్యకలాపాలకు చెక్‌ పెట్టేందుకు మనీ లాండరింగ్‌ చట్టానికి సవరణలు చేశారు. దీంతో బంగారం కొనుగోళ్లను ఐటీ పరిధిలోకి తీసుకొచ్చారు. వాటిపై ఆంక్షలు విధించారు. నగదు రూపంలో రెండు లక్షలకు పైగా బంగారం కొంటే ఆధార్‌, పాన్‌ నెంబర్‌ ఇవ్వాల్సిందే..! ఇలా బంగారం కొనుగోలు చేసిన వారి జాబితా మొత్తాన్ని వ్యాపారులు ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

నిజానికి ఇతర దేశాల నుంచి భారత్‌కి భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా అవుతోంది. అంతేకాదు.. ఎయిర్‌పోర్టుల్లో బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడటం చూస్తుంటాం.. కేరళ గోల్డ్‌ స్కామ్‌ వ్యవహారం ఇప్పటికీ దేశాన్ని కుదిపేస్తోంది. ఉగ్రవాదులు బంగారం స్మగ్లింగ్‌ ద్వారా నిధులను సమీకరిస్తున్నారు. పసిడి పేరు మీద ఉగ్రవాదులు డబ్బు చేరవేస్తున్నరనే అనుమానాలు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా నగదు రూపంలో జరిగే లావాదేవీలపై నిఘా పెట్టింది కేంద్రం. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా మనీ లాండరింగ్‌, ఉగ్రవాద కార్యకలాపాలను మానిటర్‌ చేసే ఎఫ్‌ఏటీఎఫ్‌.. ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సూచనలతో నిబంధనలు మార్చినట్లు తెలుస్తోంది.

ఎఫ్‌ఏటీఎఫ్‌ అంతర్జాతీయంగా మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు ఫండింగ్‌తో పాటు ఇతర అక్రమ కార్యకలాపాలపై నిబంధనలను రూపొందిస్తుంది. ఇందులో భారత్‌ 2010 నుంచి సభ్య దేశంగా ఉంది. అందుకే సభ్యదేశంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ సూచనలను పాటించాల్సిన అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news