ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై జోకులేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను హేళన చేయడమంటే.. దేశ ప్రజలను అవమానించినట్టేనని అభిప్రాయపడ్డారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా ప్రయాస్ భావనతో అందరూ ముందుకు వెళ్తున్నపుడు ‘ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థా?’ అంటూ వెక్కిరిస్తూ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
గురువారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో ‘అమృతకాల బడ్జెట్’పై నిర్వహించిన చర్చా వేదికలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ‘‘ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యంపై జోకులు వేయవద్దని చేతులు జోడించి అడుగుతున్నా. మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ తమవంతుగా భాగస్వాములు కావాల్సి ఉండగా, ఇలా మాట్లాడటం సరికాదు’’ అని ఆక్షేపించారు. ఎన్డీఏ అంటే ‘నో డేటా ఎవైలబుల్ గవర్నమెంట్’ అని వ్యాఖ్యానించడాన్నీ తప్పుపట్టారు. అప్పులపై కేంద్రాన్ని విమర్శిస్తున్న వారు రాష్ట్ర అప్పుల సంగతేమిటో చెప్పాలన్నారు.