రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

-

దేశంలో జరుగుతున్న కొన్ని రోడ్డు ప్రమాదాలకు ఆయా సంస్థలు రూపొందించే తప్పుడు ప్రాజెక్టు నివేదికలే కారణమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైవేలు, ఇతర రోడ్ల నిర్మాణానికి సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌)లు తయారు చేసేందుకు వీలుగా సదరు కంపెనీలకు సరైన శిక్షణ అవసరమని నొక్కి చెప్పారు. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త టెక్నాలజీల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

‘‘కంపెనీలు తయారుచేసిన కొన్ని డీపీఆర్‌లు చాలా చెత్తగా ఉంటాయి.. అవే రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఏదైనా డీపీఆర్‌ల నుంచే మొదలవ్వాలి. వాటిని సిద్ధం చేసే కంపెనీలు మెరుగుపడకపోతే మళ్లీ సమస్య పునరావృతమవుతుంది’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

నైపుణ్యంలేని డ్రైవర్‌ చేతిలో కొత్త అధునాతన కార్లు కూడా సమస్యలను సృష్టిస్తుందంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా 2021లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏకంగా 1.55లక్షల మంది దుర్మరణం చెందారు. అంటే సగటున ప్రతి గంటకు 18 మంది మరణిస్తుండగా, ఒక్కరోజులో 426మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news