దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి రోజున టపాసులపై పూర్తి నిషేధం విధించింది. అంతేకాకుండా..ఢిల్లీలో అన్ని రకాల పటాకుల తయారీ, అమ్మకాలు, నిల్వలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పటాకులు కాల్చితే ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తామని గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. పటాకులు తయారీ, అమ్మకాలు, నిల్వలు జరిపితే పేలుడు పదార్ధాల చట్టంలోని 9బి సెక్షన్ కింద రూ.5,000 జరిమానా, మూడేళ్ల జైలు విధిస్తామని కూడా హెచ్చరించింది.చలికాలం నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు దీపావళి పండగ సమయంలో పటాకుల అమ్మకాలు, కాల్చడంపై ఆంక్షలు విధించింది ఢిల్లీ ప్రభుత్వం. పటాకుల తయారీ, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
పటాకుల అమ్మకాలను నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం..సరిహద్దు రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాకుల అమ్మకాలు, తయారీపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించడం వరుసగా ఇది మూడోసారి.శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీసులకు సూచనలు చేశామని చెప్పారు. ఢిల్లీలో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పామని వివరించారు. గత మూడేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్లే గాలి నాణ్యత మెరుగుపడుతుందని అన్నారు. దాన్ని ఇంకా మెరుగుపర్చాల్సి ఉందని తెలిపారు. కాబట్టి పటాకుల లైనెస్సులు ఇవ్వకూడదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిట్లు తెలిపారు. ఢిల్లీ వాసులుగా తాము దీపావళిని లైట్లు, దీపాలతో జరుపుకుంటామని చెప్పుకొచ్చారు.