ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. అవినీతి అరోపణల కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు భద్రతపై ఆయన లాయర్లు కోర్టుల పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో.. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఎస్పీజీ ప్రొటక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామని, చంద్రబాబు అనుమతి లేకుండా ఎవరు కూడా వారి బ్లాక్ వద్దకు కూడా వెళ్లలేరని సీఐడీ తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆయన కోసం ఓ బ్లాక్ మొత్తం కేటాయించామని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌పై స్పందిస్తూ… సీఆర్పీ చట్టంలో అసలు హౌస్ రిమాండ్ అనేది లేదన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ పథకం పేరుతో రూ.371 కోట్ల రాష్ట్ర ఖజానా దోపిడీకి గురైందన్నారు. షెల్ కంపెనీలపై జీఎస్టీకీ ఆధారాలు దొరికాయన్నారు. గత ప్రభుత్వ పెద్దలు ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ప్రజల సొమ్ము దొంగ కంపెనీల ద్వారా ఓ వర్గం చేతిలోకి వెళ్లిందన్నారు. కుంభకోణం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తోందన్నారు. థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ ఎక్కడా జరగలేదన్నారు.
ఎలాంటి చర్చ లేకుండానే ఎంవోయూలు కుదుర్చుకున్నారని, అసలు డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఫండ్స్ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి మేం చేశామని నాటి సీఎస్ చెప్పారన్నారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ప్రభుత్వం భారీ భద్రతను కల్పించిందని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ఆయనకు కావాల్సిన ఆహారం, మందులు అందుతున్నాయన్నారు. సహృదయంతో చంద్రబాబు విన్నపాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ అతీతులు కాదన్నారు.