బీజేపీలో చేరికలకు ఇక ఢిల్లీలో నో ఎంట్రీ..అంతా లోకల్

-

ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసిన తెలంగాణ బీజేపీ నాయకులు రండి రండి దయచేయండి అని ఆహ్వానిస్తున్నారు పక్క పార్టీ నేతల్ని. ఢిల్లీ పెద్దలు మాత్రం నో ఎంట్రీ అని చెబుతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌ నేతల మధ్య సడన్ గా వచ్చిన ఈ మార్పుల పై కమలనాథుల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

తెలంగాణలో తమకు మంచిరోజులు వచ్చాయని భావిస్తున్నారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పనిలో పడ్డారు. దుబ్బాక,గ్రేటర్ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్‌ పెరగడంతో చాలా మంది కమలనాథులతో టచ్‌లోకి వెళ్లారు కూడా. విజయశాంతి.. గూడూరు నారాయణరెడ్డి.. స్వామిగౌడ్‌ లాంటి వారు ఢిల్లీ వెళ్లి పార్టీ కండువా కప్పేసుకున్నారు కూడా. మరికొందరు సైతం క్యూలో ఉన్నారు. అయితే అందరినీ ఢిల్లీ తీసుకురావొద్దని చెప్పారట హస్తిన నాయకులు.

పార్టీలో చేరికలు ఏమైనా ఉంటే.. హైదరాబాద్‌ లేదా తెలంగాణ స్థాయిలోనే చూసుకోవాలని ఢిల్లీ పెద్దలు సూచించారట. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హస్తిన వేదికగా జరిగిన కొన్ని జాయినింగ్స్‌ హైదరాబాద్‌లో చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అక్కడ నుంచి చెప్పారట. తప్పదు.. మరీ ముఖ్యం అని అనుకుంటే.. కబురు పెట్టండి.. తామే హైదరాబాద్‌ వస్తాం అని చెబుతున్నారట. దీంతో బీజేపీ చేరికలు కాస్త నెమ్మదించాయని అనుకుంటున్నారు.

బీజేపీలో చేరాలని అనుకుంటున్న వారికి కూడా రాష్ట్ర పార్టీ నాయకులు ఈ విషయం చెప్పారట. దాంతో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్‌ లాంటి వారు వికారాబాద్‌లోనే సభ పెట్టి కాషాయ కండువా కప్పుకోవాలని ప్లాన్‌ చేసుకుంటున్నారట. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సైతం నిర్మల్‌లో పెద్ద సభ పెట్టి జాయిన్‌ అవుతానని రిప్లయ్‌ ఇచ్చారట. ఇదే ఆలోచనలో మరికొందరు ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news