నిర్భయను రేప్ చేసిన చట్టాలు…!

-

అందరూ ఊహించిన విధంగానే నిర్భయ దోషులకు ఉరి శిక్ష వాయిదా పడింది. ఫిబ్రవరి ఒకటి వారిని ఉరి తీస్తారని భావించారు అందరూ… కాని ఉరి శిక్ష మాత్రం అమలు జరగలేదు. వారి ఉరిని వాయిదా వెయ్యాలని పాటియాలా హౌస్ కోర్ట్ స్పష్టంగా చెప్పింది. వారి శిక్షలపై స్టే విధించాలి అంటూ నిందితులు కోర్ట్ కి వెళ్ళగా దానికి కోర్ట్ అంగీకరించి వారి ఉరి శిక్ష అమలుని వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది.

నలుగురు నిందితుల్లో ఒక నిందితుడి క్షమాభిక్ష రాష్ట్రం వద్ద పెండింగ్ లో ఉంది. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటే ఉరి శిక్షకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. సరే అక్కడ పెండింగ్ లో ఉన్నదీ కేవలం వినయ్ కుమార్ అనే నిందితుడి క్షమాభిక్ష. అంటే మిగిలిన ముగ్గురు నిందితులను ఉరి తీయవచ్చు. ఇదే విషయాన్ని పాటియాలా హౌస్ కోర్ట్ కి కేంద్రం చెప్పింది. వాళ్ళను ఉరి తీయవచ్చు అంది కేంద్రం.

కాని న్యాయవాది అడ్డుపడ్డారు… అలా కుదరదు నిభందనలు అంగీకరించవు అన్నారు. దీనిపై విచారణ జరిగింది. చివరికి తీర్పు ఇచ్చి తాను చెప్పే వరకు ఉరి తీయవద్దు అని రేపు ఉదయం అమలు చేసే ఉరిని ఆపేశారు. అటు తీహార్ జైలు అధికారులు మేము ఉరి తీయడానికి సిద్దంగా ఉన్నామని చెప్తూ అన్ని సిద్దం చేసుకుని… మీరట్ కి చెందిన పవన్ జలాద్ అనే తలారిని తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కల్పించారు.

సరే మరి ఉరి పరిస్థితి ఏంటి…? ఎప్పుడు ఉరి తీస్తారు…? నిందితులను కాపాడేది ఎవరు…? సిగ్గుతో భారతదేశం తల దించుకోవాలి సమాధానం చెప్పలేక. అవును మీరు అవునన్నా కాదన్నా సరే అది నిజం. సిగ్గుతో భారతదేశం తలదించుకోవాలి. 2012 లో దేశ రాజధానిలో ఒక ఆడపిల్లను దారుణంగా అత్యాచారం చేస్తే 7 ఏళ్ళ నుంచి వాళ్ళను జైల్లో పెట్టి మేపుతుంది మన చట్టం.

ఎప్పుడో 2013 లో ఉరి శిక్ష వాళ్లకు విధిస్తే మన చట్టాలు ఇప్పటి వరకు ఉరి తీయలేకపోతున్నాయి. నిందితులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే ఉన్నారు. నిర్భయను శారీరకంగా ఆ నలుగురు రేప్ చేస్తే నిర్భయ ఆత్మను మన చట్టాలు రేప్ చేసాయి. ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇది వాస్తవం. ఏడేళ్ళ నుంచి వాళ్ళు జైల్లో తిని పడుకుని, ఒకడికి సిక్స్ ప్యాక్ బాడీ కూడా వచ్చింది.

ఒకడి తర్వాత ఒకడు క్షమాభిక్ష పెట్టుకుంటున్నారు. రాష్ట్రపతి వద్దంటే సుప్రీం కోర్ట్ కి వెళ్తున్నారు. సుప్రీం కోర్ట్ వద్దంటే మరో వాదనతో పాటియాలా కోర్ట్ కి వెళ్తున్నారు. పాటియాలా కోర్ట్ వద్దంటే ఢిల్లీ హైకోర్ట్. ఢిల్లీ హైకోర్ట్ కొట్టేస్తే మళ్ళీ మరో వాదనతో పాటియాలా కోర్ట్. పాటియాలా కోర్ట్ ఆ వాదనను కొట్టేస్తే అదే వాదనతో ఢిల్లీ హైకోర్ట్… ఇలా ఏడేళ్ళ నుంచి జరుగుతూనే ఉంది.

ఇక్కడ దోషులు గెలిచారా…? నిర్భయ గెలిచిందా…? నిన్నో మొన్నో ఒక ముగ్గురికి ఉరి శిక్ష వేసారు. వాటిని అమలు చేసే సరికి ఆ ముగ్గురి వయసు కూడా అయిపోతుంది. ఈ నలుగురు కుర్రాళ్ళు కాబట్టి చాలా వయసు ఉంది. గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా చేసుకునే మన దేశంలో రాజ్యాంగమే వాళ్ళను లోసుగులతో కాపాడుతుంది. కూతురుని కోల్పోయి ఆ తల్లి మీడియా ముందు ఏడుస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news