ఒడిదొడుకులు ఎన్ని ఉన్నా కూడా ప్రయాణం ఆపే వీల్లేదని తేల్చారు జగన్.సవాళ్లతో కూడిన ప్రయాణాన్ని ఇష్టపడడంతో పాటు ఇబ్బందులను అధిగమించడంలో ముందున్నారు జగన్.రెండున్నరేళ్ల కాలంలో జగన్ సాధించిన విజయాలు, సాధించాల్సిన ప్రగతి వీటిన్నింటినీ సీ ఓటర్ – ఇండియాటుడే సంస్థలు సంయుక్తంగా తెలుసుకున్నాయి.రానున్న కాలంలో జగన్ దే హవా అని తేల్చాయి. ముఖ్యమంత్రి జగన్ విషయమై అస్సలు వ్యతిరేకతే లేదా మరి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలనూ వైసీపీనే గెలుచుకుంటుందని చెబుతోంది. అంటే టీడీపీ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటును కూడా గెల్చుకోలేదా?
ప్రస్తుతానికి వైసీపీ బలం బాగానే ఉంది.పాలకులపై ప్రజలకు అసంతృప్తి ఉన్నా పథకాల కారణంగా అది పూర్తి స్థాయిలో వెల్లడి కావడం లేదు.ఇదే సమయంలో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేకపోయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం వీలున్నంత మేర పథకాలను వర్తింపజేయడంలో జగన్ ముందున్నారు.సచివాలయ వ్యవస్థ చాలా బాగుంది అన్న నమ్మకం జనాల్లో వచ్చింది.అదేవిధంగా ప్రతిపక్షం గోల చేస్తున్నంతగా చెత్తపన్నుపై పెద్దగా ప్రజా వ్యతిరేకత అయితే లేదు.వసూలు చేసే వారు కూడా చాలా హుందాగానే ఉన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రతి యాభై ఇళ్లకో,డబ్బై ఇళ్లకో నియమితులయిన వలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు.రాజకీయ ప్రమేయం పెద్దగా లేదు.ఉన్నా కూడా అది నామమాత్ర స్థాయిలోనే ఉందని తేలిపోయింది.ఇవన్నీ రానున్న కాలంలో వైసీపీకి ప్లస్ కానున్నాయి.
ఏంటి మైనస్?
ఉద్యోగుల జీతభత్యాలపై రేగుతున్న వివాదం జగన్ కు మైసస్. ఆ వర్గం అంతా ఆయన్ను వ్యతిరేకిస్తోంది.దీంతో తమ పరిధిలో యాభై లక్షల ఓట్లు ఉన్నాయని అవన్నీ జగన్ కు పడకుండా చేయడం తమకు సాధ్యమేనని ఉద్యోగులు అంటున్నారు. బెదిరిస్తున్నారు కూడా! అయితే వీటిని జగన్ పట్టించుకోవడం లేదు.వీలున్నంత మేరకు అందరినీ కలుపుకుని పోయేందుకే తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. కనుక ఉద్యోగుల బెదిరింపులకు తాను హడలిపోననని,సమస్యల పరిష్కారానికి తాను చర్చలకు సిద్ధమేనని పదే పదే అంటున్నారు. ఇక పింఛన్ల తొలగింపు పై మాత్రం ఇంకా కొంత అసంతృప్తి ఉంది.లోపాలను సరిదిద్దే ప్రయత్నం ఒకటి చేయాలి.సచివాలయాల్లో సిబ్బంది ప్రొహిబిషన్ పీరియడ్ కన్ఫం చేయకపోవడం వల్ల కొంత అవస్థపడుతున్నా రు.దీనిని కూడా వీలున్నంత త్వరగా రెక్టిఫై చేయాల్సి ఉంది. ఇక ఇసుక,మైనింగ్ తో పాటు మద్యం అమ్మకాల విషయంలో జగన్ ఇప్పటికి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సొంత మనుషులను ఈ మూడు విషయాల్లో కంట్రోల్ చేయలేకపోతున్నారు.వీటితో పాటు పాలనపై మంత్రులకు పట్టు లేదు.ఆకస్మిక తనిఖీలు లేవు.దిగువ స్థాయి సిబ్బంది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సీఎం నిర్ణయాలు ఉండడం లేదు.వీటిని దిద్దకుంటే ఆయనకు ప్రమాదమే!