గుంటూరు జిల్లా పెదకాకాని లోని మళ్లేశ్వరస్వామి ఆలయంలో ఆపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్ లో మాంసాహారం వండటం కలకలం రేపింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడి క్యాంటిన్ లో అల్పాహారం తయారు చేస్తుంటారు. అన్నదానానికి కూడా ఇక్కడి నుంచి భోజనం సరఫరా చేస్తారు. ఇప్పుడు అదే క్యాంటిన్ లో కోడి కూర వండటం విమర్శలకు తావిచ్చింది.
క్యాంటిన్ నిర్వహణను ఓ ప్రైవేట్ వ్యక్తి వేలంపాటలో దక్కిచుకున్నాడు. అయితే.. అధికార పార్టీకి చెందిన ఓ నేతకు క్యాటరింగ్ వ్యాపారం ఉంది. తనకు వచ్చిన ఆర్డర్లను ఇక్కడే వండి సరఫరా చేస్తుంటాడు. ఇదే నేపథ్యంలో గురువారం ఆలయం ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్ లోనే మాంసాహారం తయారు చేయించి బయటకు పంపించారు. భక్తుల్లో ఒకరు ఇది గమనించి ఫోటోలు తీశారు.
విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చినా.. వారు నోరు మెదపడం లేదు. క్యాంటిన్ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగినట్లు సమాచారం. అయితే.. మాంసాహారం బయటే వండానని.. ఆర్డర్ ఇచ్చే వారికిఅందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చిందని అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.