ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు విశేష సేవలు అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10, 778 ఆర్బికేలు ఏర్పాటు చేయగా వీటిలో 14, 347 మంది సేవలు అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఇంకా శాఖల వారి ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బీకేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారిగా ఖాళీలను గుర్తించారు. అత్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్క తేల్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.