హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ట్రాఫిక్‌తో ఇబ్బందులకు గురవుతున్న నగర వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. దేశంలో మెట్రోపాలిటన్ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వనగరం దిశగా అడుగులు పడుతున్న వేళ వడివడిగా మరో వంతెన సిద్ధమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ముందుచూపుతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధిలో భాగంగా 17 ఫ్లైఓవర్ ప్రారంభానికి ముస్తాబు అవుతోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పించే రవాణాయే లక్ష్యంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైన శిల్పా లేఅవుట్‌లో నిర్మించిన వంతెనను ఈ నెల 20న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వంతెనకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇదే సమయంలో గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు సరళీకృత విధానాలు అమలు చేయడం, ఇందుకు తగ్గట్లుగా జీహెచ్‌ఎంసీ ప్రజల అవసరాలను ముందుగా అంచనా వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రధానంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరచడంపై దృష్టి సారించింది. వాహనదారులు గమ్యస్థానానికి సకాలంలో చేరడానికి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఆర్‌డీపీ) ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పలు పనులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే శిల్పా లే అవుట్ వద్ద నిర్మించిన 17వ ఫ్లై ఓవర్‌ను ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయి.