కేసీఆర్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. ఈ నెల 7వ తేదీన అంటే ఆదివారం రోజున రెవెన్యూ ఉద్యోగుల బహిరంగ నిర్వహిస్తున్నామని ప్రకటన చేశారు తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఎంతో బలోపేతం అవుతుందని భావించాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న దానికి భిన్నంగా నిర్వీర్యం చేస్తూ వస్తుంది. చివరకు ఉనికినే లేకుండా చేసే చర్యలకు ఉపక్రమించిందని ఆగ్రహించారు.
రాష్ట్రంలోని సుమారు 5 వేల మంది వీఆర్ఓల గొంతు కోసి రెవెన్యూ శాఖకు దూరం చేసింది. సుమారు మరో 23 వేల మంది వీఆర్ఏల మెడలపై కత్తి వేలాడుతూనే ఉంది. ఏ క్షణ మైనా వీరు సైతం రెవెన్యూ శాఖకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. చివరకు వీరి సమస్యలపై సీఎంగారే అసెంబ్లీలో ఇచ్చిన హామీనే నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని నిప్పులు చెరిగారు. ప్రస్తుతం శాఖలో వివిధ హోదాలలో పని చేస్తున్న అధికారులపై భారం, ఒత్తిడి పెరిగి పోయింది. ఈ పరిస్థితి పోవాలి. రెవెన్యూ శాఖకు పూర్వ వైభవం రావాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలి. మన సమస్యలపై మనమే ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.