తెలంగాణలో రాజకీయం ఓ రేంజ్ లో నడుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని రాజకీయంగానే చూస్తున్నారు. ఇదే క్రమంలో వరుసగా పేపర్ల లీకేజ్ అంశంపై రచ్చ నడుస్తోంది. మొదట టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీక్ అవ్వగా, ఆ తర్వాత టెన్త్ పేపర్లు లీక్ అయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయంగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేశాయి.
కేసిఆర్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ అంశం ఎంతో కొంత గులాబీ పార్టీకి మైనస్ అవుతూనే వచ్చిందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో టెన్త్ పేపర్ల లీకులో కుట్ర ఉందని బయటకు రావడం, ఆ కుట్రకు కారణం బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అని కేసు పెట్టడం, ఆయన్ని అరెస్ట్ చేయడంతో రాజకీయం మరో మలుపు తిరుగుతుంది. బిజేపికి అనుకూలంగా ఉన్న టీచర్ల చేత బండి పేపర్ల లీక్ చేయించి..ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకుని కేసిఆర్ సర్కారుని టార్గెట్ చేసి బద్నామ్ చేయాలని చూశారని బిఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.
అయితే ఆ దిశగానే పోలీసులు కేసు పెట్టడం, ఏ1గా బండిని అరెస్ట్ చేయడం చేశారు. దీంతో పేపర్ల లీక్ అంశం మరో కోణం వచ్చింది. దీంతో నిజంగానే ప్రభుత్వం తప్పు ఏమి లేదా? ఇందులో బిజేపి కుట్ర ఉందా? అని ప్రజలు ఆలోచించేలా రాజకీయం మొదలైంది. అదే సమయంలో రాజకీయంగా దూకుడుగా ఉన్న బిజేపికి చెక్ పెట్టడానికి ఇది బిఆర్‌ఎస్ వేసిన ఎత్తు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
అంటే రెండు కోణాలు ఉన్నాయి. అసలు టోటల్ గా బిజేపి, బిఆర్‌ఎస్ ఆడుతున్న పోలిటికల్ గేమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మొత్తానికి ఈ పేపర్ల లీకేజ్ అంశం రాజకీయంగా నష్టమైన, లాభమైన బిఆర్‌ఎస్-బిజేపిలకే జరగాలి.