రెండు రోజుల తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో రసాభాసా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ప్రస్తుతం 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే నిబంధనలు ఉల్లంఘించినందుకు 12 మంది విపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్దం అంటూ.. తమ హక్కును హరించడమే అంటూ విపక్ష ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే క్షమాపణలు చెబితే.. సస్పెన్షన్ ఎత్తివేస్తామని ఇదివరకే వెంకయ్యనాయుడు తెలిపాడు. తాము తప్పు చేయలేదని క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని విపక్షాలు అంటున్నాయి.
తాజాగా ఈరోజు కూడా రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. రాజ్య సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించేలా రెచ్చగొడుతోంది. అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. విపక్షాల వాకౌట్ చేసిన కొద్దిసేపటికి.. రాజ్యసభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.