కేసీఆర్ వి తుగ్లక్ చర్యలు. జీవో 317తో ఉద్యోగుల్లో గందరగోళం— బండి సంజయ్..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. 317 జీవోతో ఉద్యోగుల స్థానికతకు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలతో ఉద్యోగుల్లో ఆందోళన ఏర్పడిందన్నారు. స్థానిక ఉద్యోగులు ఇతర జిల్లాలకు వెళ్లే దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉద్యోగుల్లో చీలిక తెచ్చి రాజకీయంగా లబ్ధిపొందాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తుందని విమర్శించారు.

ముఖ్యంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పాత సమస్యలను దారి మళ్లించి మళ్లీ కొత్తగా సమస్యలను తీసుకువస్తున్నారని ఆరోపించారు. జీవో 317తో ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. జీవో 317 అమలును వెంటనే నిలపివేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఈ విషయమై ముందుగా ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ప్రభుత్వానికి సూచించారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.