సీనియర్ నటుడు చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు(78)కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాల పాత్రల్లో నటించాడు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు చలపతిరావు. ఆయన మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘ప్రముఖ నటులు శ్రీ చలపతిరావు గారు కన్నుమూయడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనను చూపించారు చలపతిరావు గారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. శ్రీ చలపతిరావు గారి కుమారుడు నటుడు, దర్శకుడు శ్రీ రవిబాబు గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరం.’ అని పవన్ సంతాపం తెలిపారు.
అయితే.. చలపతిరావు స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్లపల్లి . ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. రెండు రోజలు క్రితమే సీనియర్ నటుడు కైకాల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో నటుడిని కోల్పోవడంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. చలపతిరావు నటించిన మొదటి చిత్రం గూఢచారి 116, చివరి చిత్రం ఓ మనిషి నీవెవరు.