స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జనసేన కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని జాతీయ
పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. జనసేన పార్టీ అధ్వర్యంలో ప్రజా కోర్టు అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ చేయనున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 38 కేసులు ఉన్న వైఎస్ జగన్ కోర్టు తీర్పులను తప్పు పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల తీర్పుల పట్ల జగన్ వ్యవహరించే తీరు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అ సమాజాన్ని మార్చగలిగే శక్తి స్త్రీలకు మాత్రమే ఉందని.. స్త్రీ తలచుకుంటే మార్పు తథ్యమని అన్నారు. మహిళలు బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో 15 మంది మహిళలు కూడా పాలుపంచుకున్నారని గుర్తు చేశారు.
అంతేకాదు మహిళ వంటగదికి పరిమితం కాకుండా తన స్వంత కాళ్ళ మీద నిలబడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఉండాలి అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఇంకోసారి అధికారంలోకి వస్తే తాము ఏపీలో ఉండలేమని…వేరే రాష్ట్రాలకు లేదా దేశాలకు తరలిపోతున్నామని కొంతమంది అంటున్నారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఎక్కడకు వెళ్లినా వివక్ష ఉంటుందని, మీరెందుకు మీ నేల విడిచి వెళ్లిపోవాలి? ఎదురు తిరగాలి కదా..? అని పవన్ కల్యాణ్ సూచించారు.