జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అమరావతి విషయంలో హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చేశారు. తన మనసులో ఉన్న మాటను ఆయన అఫిడవిట్ రూపంలో స్పష్టం చేసేశారు. రాష్ట్రానికి ఒక రాజధాని చాలని, కేవలం అది అమరావతి అయితే సరిపోతుందని.. మూడు రాజధానులు అవసరం లేదని, ప్రపంచంలో ఎక్కడా ఏ రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు లేవని కూడా పవన్ చెప్పుకొచ్చారు. పైగా రైతులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. దీనినిఅందరూ కోరుతున్నదే.

అయితే, ఇక్కడే .. ఇప్పుడు.. రాజకీయంగా పవన్‌కు తీవ్ర ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పవన్ ఇచ్చిన అఫిడవిట్ పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో రూపొందించినట్టుగా ఉందనే అభిప్రాయం జనసేనలోనే వ్యక్తమవుతోంది. మనకంటూ.. కొన్ని ఫార్ములాలను పెట్టుకున్నాం. అయితే, ఇప్పుడు ఇచ్చిన అపిడవిట్లో సదరు ఫార్ములాలను పూర్తిగా విస్మరించాం. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అనుకున్నాం. ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు పెట్టాలనేది మన విధి విధానం.
అయితే, దీనిని అఫిడవిట్లో ఎక్కడా పొందుపరచలేదు. పైగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సూచన లను కూడా పవన్ ఎక్కడా పేర్కొనలేదు. కేవలం అమరావతి మాత్రమే ఉండాలని.. ఇక్కడ మాత్రమే అభివృద్ధి చేయాలని పవన్ స్పష్టం చేయడంపై ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల్లోనే జనసేన నాయకులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం చంద్రబాబుకు దూరంగా ఉన్నామనే పేరు తప్ప.. ఆయన కనుసన్నల్లోనే ఈ అఫిడవిట్ దాఖలైనట్టుగా ఉందని కొందరు ఆఫ్ దిరికార్డుగా నాయకులు వ్యాఖ్యలు కుమ్మరిస్తున్నారు.
ఈ పరిణామం.. ఇప్పుడు బాగున్నా..రేపు ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే.. అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? అనేది వీరి ప్రధాన ప్రశ్న. ఏదైనా.. ఒక కీలక నిర్ణయం తీసుకునే ముందు.. రాజకీయ నేతలను సంప్రదించాల్సిన అవసరం ఉన్నా.. సంప్రదించకుండా.. సంప్రదించామని చెప్పడం అనేది.. కొన్ని పార్టీల్లోనే ఉందని.. ఇప్పుడు మన దగ్గర కూడా కనిపిస్తోందని అంటున్నారు. ఈ పరిణామాలు మున్ముందు తీవ్రంగా మారడం ఖాయమని చెబుతున్నారు.
-Vuyyuru Subhash