అభిమానులకు నచ్చితే కథ సూపర్.. అందరికీ నచ్చితే ఓ కథ ఆ సినిమా బ్లాక్ బస్టర్.. కనుక సినిమా అందరికీ.. అందరిదీ! ఇదే ఫార్ములా పవన్ నమ్ముతారు. అదే పాటించాలని చెబుతూ ఉంటారు కూడా ! కానీ దర్శకులు ఆయన్ను కొన్నింటికే పరిమితం చేస్తారు. ఫార్ములా ఓరియెంటేషన్ నుంచి పవన్ కూడా బయటకు రావాలి.. ఆయన కోరుకుంటున్నా దర్శకులు మాత్రం ఆ కాగల కార్యాన్ని తీర్చడం లేదు. మరి! రాబోయే సినిమా ఏం చేయనుంది ?
తెరపై పవర్ స్టార్ అదే తెరపై అల్లుడు సాయి ధరమ్ తేజ్.. సుప్రీం హీరో అని అభిమానులు పిలుచుకునే ఈ కుర్ర కథానాయకుడు త్వరలోనే తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోనున్నారు. మామయ్యతో కలిసి నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నో అంచనాల నేపథ్యంలో వస్తున్న ఆ తమిళ సినిమా రీమేక్ వివరం ఈ కథనంలో.. ! ఇదే సమయాన ఎన్నో సంచనాలకు కేరాఫ్ గా నిలిచిన
డైరెక్టర్ సముద్రఖని దగ్గర కొన్ని పాఠాలు కూడా ఇదే సమయంలో తేజూ నేర్చుకోవాలి. నటన పరంగా తేజూ మెరుగుపడాలి.. అని కూడా కోరుకుందాం ఈ వారాంతాన.
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు కొదవ లేదు..ఓ సినిమా వస్తుంది అనుకొనే లోపు మరో సినిమాకు నిర్మాతలు కొబ్బరికాయ కొడుతున్నారు.. కొన్ని సార్లు తెర మీదకు వచ్చిన అన్నీ కూడా భారీ హిట్ ను అందుకోక పోయిన కూడా మన డైరెక్టర్లు ఆ ఫార్ములాను మాత్రం వదలడం లేదు.. మొన్న వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా అంత మంచి టాక్ ను అందుకోలేక పోయినా కూడా మళ్లీ కొన్ని కాంబినేషన్లకు సంబంధించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయాన కథ పరంగా ఆచార్య కూడా అస్సలు ఆకట్టుకోకపోయినా వెంటనే ఇప్పుడు మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.
అది కూడా మళ్ళీ మెగా హీరోల మల్టిస్టారర్ కావడమే విశేషం. పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్.. మామ అల్లుళ్ల కలయికలో కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వినోదయ సీతమ్’ ను తెలుగులో రూపొందించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. జూన్ లో కొబ్బరికాయ కొట్టి నిర్విరామంగా సినిమాను శరవేగంగా తెరకెక్కించాలనే ఆలోచనలో డైరెక్టర్ సముద్ర ఖని ఉన్నారని టాక్. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్‌కు వర్క్ చేయనున్నారు.
కాగా, తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని మార్పులు చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. బుర్రా సాయి మాధవ్ పేరును డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ సూచించారని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మహేశ్ తో సినిమా చేసే హడావుడిలో ఉన్న త్రివిక్రమ్.. ఇకపై ఈ సినిమాపై పెద్దగా దృష్టి సారించలేకపోవచ్చు. అందుకనే త్రివిక్రమ్ ఈ సలహా ఇచ్చి ఉంటారు. ఓ కొత్త తరహా కథాంశంతో తెలుగులో జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.