జనసేనాని పవన్ కళ్యాణ్ వేస్తున్న రాజకీయ స్టెప్పులతో ఆ పార్టీ నాయకులు అడ్రస్ కోల్పోతున్నారా? తనకంటే.. సినీవేదిక ఉంది.. కాబట్టి.. పవన్ అక్కడికి వెళ్లి సంపాయించుకుంటారు. మరి రాజకీయాలనే నమ్ముకున్నవారి పరిస్థితి ఏంటి? పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు ఈ ప్రశ్నలనే నాయకులకు మిగిలుస్తున్నాయి. “మీరు తీసుకునే నిర్ణయాలు.. పార్టీపైనే కాకుండా పార్టీని నమ్ముకుని అడుగులు వేస్తున్న మాపైనా ప్రబావం చూపిస్తున్నాయి“ అని నాయకులు తలలు బాదుకుంటున్నారు. ఇక, ఇదే విషయంపై పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా కలవరపడుతున్నట్టు సమాచారం.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చక్రం తిప్పిన నాదెండ్ల మనోహర్.. కాంగ్రెస్‌లో ఉండగా మంచి పేరు సంపాయించుకున్నారు. వివాద రహితుడిగా, అవినీతి మకిలి అంటని నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే, రాష్ట్ర విభజనతర్వాత కాంగ్రెస్ కొట్టుకుపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. తర్వాత అనూహ్యంగా జనసేన బాటపట్టారు. వైఎస్సార్ సీపీలోకి చేరతారని అందరూ అనుకున్నారు. దీనికి కారణం.. నాదెండ్ల తండ్రి భాస్కరరావు జగన్‌కు అనుకూలంగా వ్యవహరించడమే. అయితే, నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్ వెంట నడిచారు. గత ఏడాది ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అయితే, ఇప్పుడు ఇక, రాజకీయంగా ముందుకు అడుగులు పడని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదా సహా అమరావతి రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్.. ముందు వీరోచిత వ్యాఖ్యలు చేసి.. తర్వాత తప్పుకొన్నారు. ఫలితంగా పార్టీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు పూర్తిగా అడుగంటాయి. మరీ ముఖ్యంగా రాజధాని విషయంలో తమను ఎవరూ ప్రశ్నించవద్దంటూ.. జారీ చేసిన హుకుం.. వ్యక్తిగతంగా పవన్ ఇమేజ్‌ను మైనస్ చేసేసింది. ఇక, పార్టీ గురించి పట్టించుకునేవారు కూడా తగ్గిపోతున్నారు.ఈ నేపథ్యంలో అదే గుంటూరు జిల్లాకుచెందిన తెనాలి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా నాదెండ్లకు ఈ సెగబాగానే తగిలేట్టు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి నాదెండ్ల కూడా దీనిపైనే మధనం చెందుతున్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.