77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతరం వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అక్రమాస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చే వారికి గిఫ్ట్ ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ పాలనలో అవినీతి, అక్రమాలకు తావిచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావనే భయం వద్దని పవన్ కల్యాణ్ ప్రజలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాల కంటే పారదర్శకంగా మరిన్ని మంచి పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలవాలని సూచించారు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్. అంతేకాదు విశాఖ ఉక్కును కాపాడుకుంటామని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకుంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాలలో ప్రస్తుతం తాడగానికి నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు.