రీల్ హీరో: దినదినం దిగజారిపోతున్న పవన్!

-

అధికారంకోసం కాదు, పదవులకోసం కాదు.. ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. “అది తప్ప” అన్నీ చేస్తున్నారు! అయితే తాజాగా జరిగిన ఒక సంఘటనతో… పవన్ పొలిటికల్ కెరీర్ దినదినం దిగజారిపోతుందనే కామెంట్లు బలంగా పడుతున్నాయి! అందుకు కారణమైంది… తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్!

అవును… “అసలే చీకటి గాడాంధకారం…” అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఆ చీకటి తనే కొనితెచ్చుకుంటున్నాడని ఇప్పటికే పలుసందర్భాలు గుర్తుచేశాయి! నాడు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ప్రతిపక్షాన్ని “ప్రశ్నిస్తూ”.. అధికారపక్షంపై “ప్రశంసలు”కురిపించినప్పుడే చీకటి తెరలు స్టార్ట్ అయ్యాయి! అనంతరం వారితో చెడిందని చెబుతూ పాచిపోయిన లడ్డూలిచ్చిన బీజేపీతో జతకట్టారు.. ఫలితం మరింత చీకటి? అయితే తాజాగా హథ్రాస్ ఘటనలో సీబీఐ దర్యాప్తు సరైన నిర్ణయం అంటూ ప్రెస్ నోట్ విడుదల చేయడం మాత్రం పవన్ దిగజారుడు తనానికి పరాకాష్టగా నిలిచిందనే కామెంట్లకు కారణమైంది!

“హథ్రాస్ లో జరిగిన పైశాచిక అత్యాచార కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించడం ద్వారా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ భావిస్తోంది. సీబీఐ విచారణ ద్వారా దోషులకు శిక్ష పడుతుందని జనసేన విశ్వసిస్తోంది.” అంటూ రాసుకొచ్చారు పవన్ కల్యాణ్! ఇంత ఘోరం జరిగినప్పుడు దేశం మొత్తం స్పందించింది.. మహిళాలోకం విలపించింది.. నెటిజన్లు యూపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు! నాడు కనీసం నోరు మెదపని, మెదలపేని జనసేన నాయకుడు.. సీబీఐ ఎంక్వైరీ వేస్తే మాత్రం “సూపర్ సూపర్” అంటూ చప్పట్లు కొడుతున్నాడు!

నేడు సీబీఐ ఎంక్వైరీ స్పందించడం తప్పు కాకపోవచ్చు.. ఎప్పుడంటే ముందుగా అంత దారుణం జరిగినప్పుడు కనీసం స్పందించినప్పుడు! అలాకాకపోయినా… దుర్ఘటన జరిగినప్పుడు స్పందించకుండా దక్కున్న పవన్.. విచారణపై కూడా అలానే ఉంటే కాస్తో కూస్తో గౌరవంగా ఉండేది! కానీ దారుణ ఘటనపై కాకుండా… తాను పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదో ఎంక్వైరీ వేసిందని డప్పులు కొట్టడం పవన్ రాజకీయ కుసంస్కారం అనే కామెంట్లకు బలం చేకూరింది!

బీజేపీతో ఎంత పొత్తు పెట్టుకుంటే మాత్రం మరీ ఇంతగా ఆత్మాభిమానాన్ని చంపేసుకోవాలా? మరీ ఇంత దాసుడిలా బ్రతకాలా? పవన్ ఇంతలా దిగజారిపోవాలా? పవన్ రాజకీయాల్లోకి వచ్చింది జనాలను నమ్ముకునా, బీజేపీని నమ్ముకునా? పవన్ నుంచి ప్రజలు ఆశించిందైతే ఇది మాత్రం కాదు! ఎంత మిత్రపక్షం అయినా.. ఖండిచేప్పుడు ఖండిచాలి, పొగిడేటప్పుడు పొగడాలి! తమకు నచ్చని పని చేస్తున్నారని అకాలీదళ్ ఏకంగా కేంద్ర మంత్రి పదవినే వదులుకుని బీజేపీతో కటీఫ్ చెప్పడానికి రెడీ అయ్యింది!

పవన్ అంత ధైర్యం చేయనక్కరలేదు… కనీసం ఖండిస్తే సరిపోయేది.. స్పందించినా సరిపడేది! సినిమాల్లో హీరో పాత్రలు వేయడానికి నిజజీవితంలో హీరోలా బ్రతకడానికి ఉన్న తేడా పవన్ కు తెలియాలని ఈ సందర్భంగా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news