జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర ప్రస్తుతం నాలుగో దశ కొనసాగుతోంది. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా పెడనలో నిన్న నిర్వహించిన వారాహి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన – టీడీపీ ప్రభుత్వం రాబోతుందని.. రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి మనమంతా ఒక్కటి కావాలని పవన్ పిలుపునిచ్చారు. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని టీడీపీ, జనసేన శ్రేణులకు సూచించారు.
ఈ క్రమంలో ఆయన ఏపీ అధికార పక్షం వైసీపీపైనా, సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీల బలం ఉన్న ఉన్న పార్టీ వైసీపీ… ఏ పదవి లేని, కేవలం జనసైనికుల బలం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని పవన్ ఉద్ఘాటించారు. తాము ఎవరికీ భయపడబోమని, ఇవాళ టీడీపీ వాళ్లకు కూడా మేమున్నాం అనే బలాన్ని అందించామని తెలిపారు. “ఎన్డీయే కూటమి నుంచి మేం బయటికి వచ్చేశాం అని విమర్శిస్తున్నారు. మేం ఎన్డీయేలో ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి? పథకాలకు డబ్బులు ఇస్తూ కూడా మాకు భయపడుతున్నారంటే దానర్థం ఓడిపోతున్నారనే! మీరు ఇంకా భయపడాలి” అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కొందరు వైసీపీ వర్గీయులు బెదిరిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత నీ అంతు చూస్తాం అంటున్నారు. నేను మీ ముఖ్యమంత్రి జగన్ తండ్రినే ఎదుర్కొన్నాను. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయినప్పుడు ఎక్కడికీ పారిపోకుండా హైదరాబాదులోనే ఉన్నాను. ధైర్యంగా మళ్లీ పార్టీ పెట్టాను. పవన్ కల్యాణ్ మీ ఉడుత ఊపులకు భయపడేవాడు కాదు.