ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దివంగత స్టార్ హీరో శోభన్ బాబు. ‘సోగ్గాడు’ గా ఆయనకున్న ఇమేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందగాడు అయిన శోభన్ బాబు..హీరోగా మాత్రమే సినిమాలు చేసిన నటుడు. సినిమాలకు ఒకసారి గుడ్ బై చెప్పిన తర్వాత.. మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.
ఒకవేళ ఆయన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్స్ చేస్తే కనుక ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించేవారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్-శోభన్ బాబు కాంబో అలా వెండితెర మీద కనిపించేది. కానీ, అది రాలేదు. పవన్ కల్యాణ్- భీమినేని శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ‘సుస్వాగతం’ చిత్రం క్లాసికల్ హిట్ గా నిలిచింది.
ఘన విజయం సాధించిన ఈ మూవీలో పవన్ కల్యాణ్ తండ్రి పాత్రను రఘువరన్ పోషించారు. కానీ, నిజానికి ఈ పాత్రను తొలుత శోభన్ బాబు చేత చేయించాలని దర్శకుడు భీమినేని భావించారట. ఈ విషయమై శోభన్ బాబును సంప్రదించినప్పటికీ ఆయన ఓకే చెప్పలేదు. తాను హీరోగానే సినిమాలు చేశానని, సహాయ నటుడిగా చేయనని చెప్పాడట. అలా ఆ పాత్ర రఘువరన్ కు దక్కగా, ఆయన ఆ పాత్రలో జీవించేశారు. పవన్ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్, సినిమాలు రెండూ చేస్తున్న సంగతి అందరికీ విదితమే.