UP మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని సమాజ్ వాది పార్టీ అధికారికంగా ప్రకటించింది. ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ములాయం సింగ్ యాదవ్ అకాల మరణం తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. “శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి బడుగు, బలహీన, దళిత వర్గాల బంధు… సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ ములాయంసింగ్ యాదవ్ గారి మరణం విచారకరం. శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
సోషలిస్ట్ భావజాలంతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన దేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు పోరాటయోధుడిగా నిలిచి ప్రజా గళం వినిపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పాలనలో తన శైలిని చూపించారు. అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం తపించిన నేత ఆయన. శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు కుమారుడు శ్రీ అఖిలేశ్ యాదవ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను”. అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.