పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు జన సునామీ కొనసాగుతుంది. ఈ నెల 14న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో వారాహికి పూజలు చేయించి..ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పవన్ యాత్ర మొదలైంది. ఇక పవన్ యాత్రకు జనం నుంచి భారీ స్పందన వస్తుంది. ప్రత్తిపాడులో మొదలై..ఇప్పుడు పి.గన్నవరం వరకు జన ప్రవాహం కొనసాగింది. ఇంకా పవన్ యాత్ర ముగియలేదు..రాజోలు, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరంల్లో కూడా యాత్ర కొనసాగుతుంది.
అయితే పవన్ యాత్రకు భారీగా జనం రావడంతో జనసేన శ్రేణుల్లో జోష్ నెలకొంది. అసలు ఈ స్థాయిలో జన సునామీ అనేది ఎవరూ ఊహించలేదు. మామూలుగా అధికార వైసీపీలో జగన్ సభలకు భారీగానే జనం వస్తున్నారు. కాకపోతే ఆ సభలకు పూర్తిగా అధికార బలాన్ని ఉపయోగించి, ఎక్కడకక్కడ స్థానిక నేతలు బస్సులు, భోజనాలు ఏర్పాటు చేసి సభలకు జనాలని తీసుకొస్తున్నారు. ఇటు చంద్రబాబు రోడ్ షో సభలకు భారీగానే జనం వస్తున్నారు. ఇక్కడ కూడా టిడిపి నేతలు తమ కార్యకర్తలని తీసుకొస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజలు స్వచ్ఛందంగా వస్తే రావచ్చు.
కానీ పవన్ సభలకు ఊహించని విధంగా జనసేన శ్రేణులు వస్తున్నాయి. వారిని నాయకులు ఎవరు తరలించడం లేదు. వారికి వారే స్వచ్ఛందంగా తరలి వస్తునారు. ఈ స్థాయిలో జనం వస్తున్న నేపథ్యంలో ఇంకా జనసేన బలం పెరిగిందనే అంచనాలు వేస్తున్నారు. కాకపోతే గతంలో కూడా పవన్ సభలకు భారీగానే జనం వచ్చారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ జనసేనకు ఓటు వేయలేదు.
అంటే సభలకు వచ్చేవారు ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదు. ఈ విషయం పవన్ కూడా పలుమార్లు ప్రస్తావించారు. సభలకు భారీగా వస్తున్నారని, కానీ అవి ఓట్లుగా ఎంతవరకు మారాతాయో అని ఆయనే డౌట్ పడుతున్నారు. ఒకవేళ జన సునామీ ఓట్లుగా మారితే పవన్‌కు తిరుగుండదు. లేదంటే మళ్ళీ 2019 సీన్ రిపీట్.