వచ్చాడయ్యో.. సామీ! అన్నట్టుగా ఏపీలో రాజకీయ చుక్కానిగా ఉంటాడని భావించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పార్టీని స్థాపిం చి 7 సంవత్సరాలు అయింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్.. తర్వాత కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో మౌనం పాటించారు. అయితే, 2014 మార్చిలో అనూహ్యంగా తానే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ ఏడేళ్ల కాలంలో ఆయన చేసింది ఏమిటి? ఎలా ముందుకు వెళ్లారు? అనే విషయాలను పరిశీలిస్తే.. ఆయన చేస్తున్నది రాజకీయ వ్యూహాత్మకం అని కొందరు ఆయన సానుభూతి పరులు, అభిమానులు అంటారు. కానీ, చేజేతులా ఆయన చేసుకుంటున్నది రాజకీయ వినాశనమేనని అనేవారు కూడా ఉండడం గమనార్హం.
నిజానికి రాజకీయాల్లో ఎప్పుడు వచ్చారు అనేకన్నా.. ఎంత దూకుడుగా ముందుకు సాగుతున్నారు.. అనేది కీలకం. ఈ విష యాన్ని తీసుకుంటే.. పవన్ పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ కన్నా ఏడాది చిన్న వయసున్న వైసీపీ అధి నేత జగన్ సొంతగా పార్టీ పెట్టుకోవడమే కాదు.. తన లక్ష్యమైన అధికారంలోకి కూడా వచ్చారు. నిజానికి జగన్ కన్నా చరిష్మా ఎక్కువే ఉన్న.. వివాదాలకు దూరంగా ఉన్న పవన్ మాత్రం రాజకీయంగా వేస్తున్న అడుగులు తప్పటడుగుల నుంచి తప్పుటడులు అవుతున్నాయి.
తాను పార్టీ పెట్టిన లక్ష్యం ఏమిటి? అనేవి షయంలో నే పవన్‌కు క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది అధికారం కోసం.. తద్వారా.. ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు సాహసిస్తారు. కానీ, పవన్ విషయంలో మాత్రం ఆ తరహా రాజకీయ వ్యూహాలు కనిపించడం లేదు. ఏదో ఒక పార్టీతో అంటకాగకపోతే.. పరాన్న జీవిగా కాలం వెళ్లదీయకపోతే.. తాను రాజకీయాలు చేయలేనేమోననే బెంగలో ఆయన కూరుకుపోయారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక, 2024పై ఆశలు పెట్టుకున్నారా? లేదా? స‌్పష్టత లేదు. కానీ, పార్టీ పై ఎన్నో ఆశలు, నమ్మకాలతో ఉన్న కేడర్ మాత్రం అన్యాయానికి గురి అవుతున్నారు.
ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా.. పార్టీ బలోపేతం కావడం లేదు. నాయకులు లేరు. కేడర్ ఉందో లేదో తెలియడం లేదు. బీజేపీతో అంటకాగడాన్ని పరోక్షంగా టీడీపీతో చెలిమి చేయడాన్ని కూడా పార్టీలో సీనియర్లు సహించలేక పార్టీకిదూరమవుతున్న పరిస్థితి ఉంది. ఇలా.. మొత్తంగా పవన్ చేస్తున్నది.. రాజకీయ వ్యూహమని అంటున్నా.. విశ్లేషకుల అభిప్రాయంలో ఆయన చేసుకుంటున్నది రాజకీయ వినాశనమే!