ఎట్టి పరిస్థితిల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని.. త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని ప్రకటన చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అది రైతుల ఉద్యమం కాదని.. టిడిపి దగ్గరుండి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోందని వెల్లడించారు. నైతిక విలువల్లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని మండిపడ్డారు. తోక పార్టీలను వెంటేసుకొని చంద్రబాబు అబద్దాలాడుతున్నాడని.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వామపక్షాలు, కాంగ్రెస్, బిజెపి ఒకే వేదికపైకి వచ్చాయని పేర్కొన్నారు.
సిఎం జగన్ ను పదవి నుంచి దింపాలనే అనైతికంగా పొత్తులు పెట్టుకున్నారని.. కోర్టు ఒకే రాజధానికి అనుకూలంగా తీర్పు ఇస్తుందని చంద్రబాబు చెబుతున్నారని అగ్రహించారు. కోర్టు తీర్పులను కూడా ముందుగానే చంద్రబాబు చెబుతున్నాడంటే ఏ స్థాయిలో వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నాడో వేరే చెప్పనక్కర్లేదన్నారు. వైసిపిలో ఎంగిలి కూడు తిన్న నాయకులు ఇప్పుడు జగన్ ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో జతకలిసి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని.. చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రయోజనాల కంటే అమరావతి భూ సమస్యే ఎక్కువగా కనిపించిందని మండిపడ్డారు పెద్ది రెడ్డి.