కరోనా నేపథ్యంలో మొదటి వేవ్, రెండో వేవ్ సందర్బంగా వైద్య సిబ్బందికి ఎక్కడ చూసినా తీవ్రమైన కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు సిబ్బందిని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోవిడ్ మూడో వేవ్ వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో కొత్తగా నిరుద్యోగులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
దేశంలో ఔత్సాహికులైన యువతీ యువకులు, నిరుద్యోగులకు కేంద్రం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 కింద ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనుంది. ఈ పథకంలో భాగంగా మొత్తం 1 లక్ష మందిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు గాను మొత్తం 6 విభాగాల్లో క్రాష్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఈ కోర్సు కాల వ్యవధి 2-3 నెలలు ఉంటుంది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 111 శిక్షణా కేంద్రాల్లో ఈ క్రాష్ కోర్సులో శిక్షణను అందివ్వనున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి కేంద్రం మొత్తం రూ.276 కోట్లను ఖర్చు చేయనుంది.
హోమ్ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్‌డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడికల్ ఎక్విప్‌మెంట్ సపోర్ట్.. ఇలా మొత్తం 6 విభాగాల్లో అభ్యర్థులకు శిక్షణనిస్తారు. కోవిడ్ మూడో వేవ్ వస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఈ క్రాష్ కోర్సును ప్రవేశపెట్టింది. నాన్ మెడికల్ హెల్త్ కేర్ వర్కర్లుగా శిక్షణ పొందిన వారు ఉద్యోగాల్లో చేరుతారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది.