కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు, సహాయ చర్యలపై ప్రధాని ఆరా తీశారు. ఈ సందర్భంగా కోజికోడ్, మలప్పురం జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నారని సీఎం విజయన్ ప్రధానికి తెలిపారు. ఐజీ అశోక్ యాదవ్ కూడా ఘటన ప్రాంతానికి చేరుకొని సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అయితే ప్రమాద సమయంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ సిబ్బంది విమానంలో ఉన్నారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.