సీతారామం’ విజయం ఖండాంతరాలను సైతం దాటింది. ఈ చిత్రంపై ప్రేమను తెలియజేస్తూ ఓ అభిమాని చిత్ర యూనిట్‌కు ప్రేమ లేఖ రాశారు. ఒకటి.. రెండు.. పేజీలు కాదండోయ్. ఏకంగా నాలుగు పేజీల లెటర్ రాశారు. ఇంతకీ ఆ లేఖలో ఆ అభిమాని ఏం చెప్పారంటే..
‘సీతారామం’.. ఓ సాధారణ చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కించిన మధుర కావ్యం. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రాన్ని అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. సీత, రామ్‌గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ చెప్పిన ప్రతి మాట.. పలికించిన ప్రతి భావాన్నీ నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ సినిమాపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఘన విజయం సాధించింది. అందరూ తమకు నచ్చిన రీతిలో ఈ సినిమాపై అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన కథ ఇది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. తాజాగా మోనికా అనే పోలాండ్‌కు చెందిన అభిమాని.. ఈ చిత్రంపై తన ప్రేమను తెలియజేస్తూ నాలుగు పేజీల లేఖను రాసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ” సీతారామం చిత్ర యూనిట్‌కు పోలాండ్ నుంచి లేఖ రాస్తున్నాను. ఈ లేఖను ఎవరైనా చదువుతారా, లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఈ చిత్రంపై నా ప్రేమను, అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అని పోస్ట్‌లో తెలిపింది.
లేఖ విషయానికొస్తే అందులో .. “నేను లెఫ్టినెంట్ రామ్‌తో ప్రేమలో పడిపోయాను.. అతడిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను. ఇంత అద్భుతమైన పాత్రను సృష్టించారు చిత్ర యూనిట్. అలాగే సీత పాత్రలో మృణాల్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోలేకపోతున్నాను. మృణాల్… మీరు నా మనసును గెలుచుకున్నారు. ప్రతి ఫ్రేమ్‌లో ఎంతో అందంగా కనిపించారు. మిమ్మల్ని చూస్తే ఓ అందమైన దేవకన్యగా అనిపించారు. అలాగే మీకు గాత్రం అందించిన సింగర్ చిన్మయి శ్రీపాద లేకుండా సీతామహాలక్ష్మీ అసంపూర్ణం. సీతారామం చిత్రయూనిట్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది.
This is louuuee https://t.co/NGrikd609T
— Chinmayi Sripaada (@Chinmayi) September 17, 2022