నిన్నటి వేళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.69,306 కోట్లు కేటాయింపులు చేశారు.అంటే రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో 27.72 శాతం కేటాయింపు వ్యవసాయ రంగానికే అని సంబరపడిపోదాం.ఇది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర చెప్పిన లెక్క. ఇందులో ఎన్ని విడుదలవుతాయి. ఎంత మేరకు రైతాంగానికి ఊతం ఇస్తాయి అన్నది తరువాత మాట్లాడుకోవాలి.
తరువాత అంటే నిధుల విడుదల వెచ్చింపు అన్నవి ఎప్పుడూ సక్రమంగా ఉండవు కనుక వచ్చే బడ్జెట్ లోపు ఎన్నింటికి అనుకున్న విధంగా, ముందుగా నిర్ణయించిన తీరున ఎలా నిధులు విడుదల ఇస్తారో చూడాలి.ఇదే దశలో పోలవరాన్ని పూర్తి చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోవాలి. ఇవేవీ లేకుండా కేటాయింపుల్లో చూపించి తరువాత చుక్కలు మాత్రం అస్సలు చూపించరని మనం గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి అంచనా వేయడం నేర్చుకోవాలి. లేదా అనుకోవాలి.
చాలా రోజులకు మా సీఎంకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ప్రాజెక్టు గుర్తుకు వచ్చింది.అంటే పోలవరం ప్రాజెక్టు కు చెందిన నీళ్లు కాలువ ద్వారా విశాఖ వరకూ ఇంకా వీలుంటే ఇచ్ఛాపురం వరకూ తీసుకువచ్చి కొంత మేర సాగు తాగు అవసరాలు తీర్చి లక్ష్యాలు నెరవేరుస్తారని అనుకోవాలి.ఆ విధంగా అయ్యే ఖర్చు రెండు వేల కోట్లకు పైగా అని అనుకుంటున్నాం.లేదా బుగ్గన ఇచ్చిన డబ్బులతో ఆ పనులు చేయిస్తారని గతంలో మాదిరిగానే ఆశిస్తున్నాం.
వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కటంటే ఒక్క ఎత్తి పోత ల పథకానికి నిధులు ఇచ్చిన దాఖలాలే లేవు. అలాంటిది ఇప్పటికిప్పుడు మా జిల్లా పై అంటే మా శ్రీకాకుళం పై జగన్ ప్రేమ చూపడం అంటే సాహసమనే చెప్పాలి. అందుకే మా ప్రజాప్రతినిధులు పొంగిపోతున్నారు.ఆనందోత్సాహాలు వెల్లడి చేసి, జగనన్న ప్రకటిస్తున్న ఈ వెలకట్టలేని ప్రేమను చూసి అభిమానం చూసి ఉబ్బితబ్బిబవుతున్నారు.