ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. వరుస అరెస్టులతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అర్ధం కావట్లేదు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అచ్చెన్నాయుడి అరెస్టు మరువకముందే ఈ రోజు మరో టీడీపీ సీనియర్ నేతను పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి లను హైదరాబాదు శివారుప్రాంతం శంషాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం వీరిని అనంతపురానికి తరలిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు.