సార్.. నా పెన్సిల్ పోయింది సార్. కేసు ఫైల్ చేసి నా పెన్సిల్ వెతికిపెట్టండి అని ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. పెన్సిల్ పోవడమేంట్రా.. ఎక్కడ పోయిందని పోలీసు అడిగితే.. షార్పెనర్ లో పెట్టి చెక్కిన సార్.. మొత్తం పోయింది అని సమాధానమిస్తాడు ఆ బుడతడు. ఇదంతా వింటుంటే ఏదో సినిమాలో సీన్ గుర్తొస్తుంది కదా. అది నిజమే మరి. ఇలా చిత్రవిచిత్రమైన ఫిర్యాదులు కేవలం సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా రాజస్థాన్ లో ఇలాంటి ఓ వింత ఫిర్యాదు పోలీసుల వద్దకు వచ్చింది.
“సార్ నేను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఎలుకను ఎవరో ఎత్తుకెళ్లారు” అని పేర్కొంటూ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాడు. బాంసవాఢా జిల్లా సజ్జన్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అతనికి నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా అతడు వినిపించుకోకుండా కేసు నమోదు చేసుకుని తన ఎలుకను వెతికి పెట్టాలని పట్టుపట్టాడు
తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని, గత నెల 28న దానిని ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సోదరుడి ముగ్గురు కుమారులపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. చివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురి పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారని చెబుతున్నారు.