తిరుపతి, నాగార్జున సాగర్‌లలో కొనసాగుతున్న పోలింగ్‌

-

ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానం సహా తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్‌ నేపథ్యంలో తగిన జాగ్రత్తల మధ్య పోలింగ్‌ కొనసాగుతోంది. తిరుపతి పార్లమెంట్ స్థానానికి సంబంధించి నెల్లూరు జిల్లాలోని నాలుగు సర్వేపల్లి, గూడురు, వెంకటగిరి, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లాలో మూడు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది.

వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బీజేపీ-జనసేన కూటమి తరపున రత్నప్రభతో పాటు మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2,470 పోలింగ్‌ కేంద్రాలలో 17,10,699 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా తిరుపతి పార్లమెంటు పరిధిలో 877 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు.

ఇక తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానం విషయానికి వస్తే టీఆర్ఎస్ ‌పార్టీ నుంచి నోముల భ‌గ‌త్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలలో 2,20,300 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టీఆర్ఎస్ ‌పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ హాలియాలోని ఇబ్ర‌హీంపేట‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మే 2న ఉప ఎన్నికల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version