టీడీపీ టాప్ ఫ్యామిలీలో రాజ‌కీయ నైరాశ్యం…!

చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాలు చేస్తున్న కుటుంబం బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి కుటుంబం. వ‌రుస విజ‌యాలు.. కొన్నిసార్లు ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా.. ప‌ట్టువీడ‌కుండా రాజ‌కీయాలు సాగించిన ఈ కుటుంబం ఇటీవ‌ల కాలంలో మాత్రం తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింద‌నే టాక్ వినిపిస్తోంది.  2014 ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించిన గోపాల కృష్ణారెడ్డి.. చంద్ర‌బాబు హ‌యాంలో అట‌వీ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అయితే, అనారోగ్యం కార‌ణంగా.. బాబు ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. ఈ విష‌యంలో ఆదిలో కినుక వ‌హించిన గోపాల కృష్ణారెడ్డి.. త‌ర్వాత త‌న త‌న‌యుడికి టికెట్ ఇస్తాన‌ని హామీ ల‌భించ‌డంతో మెత్త‌బ‌డ్డారు.

స‌రే! గత ఏడాది ఎన్నిక‌ల్లో బొజ్జ‌ల కుమారుడు.. సుధీర్ రంగంలోకి దిగారు. విస్తృతంగా ప‌ర్య‌టించారు. కానీ, అనూహ్యంగా వైసీపీ దూకుడుతో సుధీర్ ఓట‌మిపాల‌య్యారు. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌టికీ.. సుధీర్ పుంజుకుంటు న్న దాఖ‌లా మాత్రం క‌నిపించ‌డం లేదు. దీనికి పార్టీ ప‌రంగా ఆయ‌న‌కు ద‌న్ను లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కార‌ణంగానే సుధీర్ సైలెంట్ అయ్యార‌నే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు.. స్థానికంగా వైసీపీ నాయ‌కుడు బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి దూకుడుగా ఉన్నారు.

అన్ని విష‌యాల్లోనూ ఆయ‌న మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో మెలుగుతున్నార‌నే టాక్ ఉంది. దీంతో టీడీపీలో కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద‌గా లేర‌నే టాక్ వినిపిస్తోంది. ఇక‌, పార్టీ ప‌రంగా చూస్తే.. బొజ్జ‌ల ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రియార్టీ ఇవ్వ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ కాలం ఈ కుటుంబం పార్టీకి సేవ చేసినా.. ఇటీవ‌ల ఏర్పాటు చేసిన పార్టీ ప‌ద‌వుల్లో వీరికి ఎక్క‌డా ప్రాధాన్యం ల‌భించ‌లేద‌నేది వీరి మాట‌. అటు పార్టీ పార్ల‌మెంట‌రీ ప‌ద‌వుల్లోనూ. ఇటు రాష్ట్ర క‌మిటీ ప‌ద‌వుల్లోనూ బొజ్జ‌ల కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యం ల‌భించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇది కూడా ఈ కుటుంబానికి శ‌రాఘాత‌మేన‌ని చెబుతున్నారు. ఒక‌వైపు అధికార పార్టీ దూకుడు.. మ‌రోవైపు సొంత పార్టీ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో బొజ్జ‌ల కుటుంబం నైరాశ్యంలో కూరుకుపోయింద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాలు ఇలానే ఉంటే.. వ‌చ్చే ఏడాదికి కూడా పుంజుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.