ఆంధ్రావనిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటన తీవ్ర ప్రకంపనలకు కారణం అవుతోంది. ముఖ్యంగా అనంత దారుల్లో నిరసనల హోరు వినిపిస్తోంది. రాయల సీమ వేదికగా బాలయ్య తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో పొలిటికల్ మైలేజ్ అంతా బాలయ్యకే వెళ్లిపోతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఉంచుతూ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని కోరుతూ, డిమాండ్ చేస్తూ బాలయ్య గత వారంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. ఇవన్నీ మీడియాలో హైలెట్ అయ్యాయి.
క్షేత్ర స్థాయిలో బాలయ్య ఉండి, రెండు రోజుల పాటు నిరసనల్లో పాల్గొని, ధర్నాలూ, ర్యాలీల పేరిట హడావుడి చేసి తన పంతం నిలుపుకునేందుకు ఎంత చేయాలో అంతా చేశారు. అయితే దీనిపై అనంతపురం కలెక్టర్ కూడా స్పందించి విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాను అని అన్నారు. బాలయ్యకు స్పష్టం అయిన హామీ ఇచ్చారు. విపక్ష ఆందోళన కనుక దీనిని పట్టించుకోవాల్సిన పనే లేదని అక్కడి హిందూపురం వైసీపీ కూడా అనుకోవడం లేదు.
ఎందుకంటే హిందూపురం జిల్లా సాధన అన్నది ఏ పార్టీకి అయినా జీవన్మరణ సమస్య. కనుక టీడీపీ మాట్లాడుతున్నంత వేగంగా అక్కడ వైసీపీ కూడా మాట్లాడాలి. వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంది కనుక నేరుగా సీఎం దృష్టికి ఇక్కడి ప్రజల ఆకాంక్షను అక్కడి పెద్దలు తీసుకుని వెళ్లగలగాలి. కానీ వాళ్ల కన్నా ముందే బాలయ్య ఓ సవాలుచేశారు.
హిందూపురం జిల్లా సాధన కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు అయినా సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. నేనే కాదు నాతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు (టీడీపీకి చెందిన) వాళ్లంతా రాజీనామాలు చేసి ప్రత్యక్ష కార్యాచరణకు వస్తారు మీరు సిద్ధమా పోరాటానికి అంటూ సవాలు చేశారు. నచ్చిందే చేస్తాం నచ్చిన విధంగానే ఉంటాం ఎవరు అడ్డొస్తారో చూస్తాం అంటూ బాలయ్య మరోసవాలు కూడా చేశారు.
అంతేకాదు ఇదే విషయమై సీఎం జగన్ ను నేరుగా కలుస్తానని బాలయ్య సంచలన ప్రకటన చేశారు. ఓవైపు బాలయ్య ఊహించని వేగంతో, రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతుంటే లోకేశ్ కానీ చంద్రబాబు కానీ పైకి ఒక్క మాటంటే ఒక్క మాట కూడా చెప్పలేక పోతున్నారు. ఈ విషయమై ఏం మాట్లాడాలో తెలియక, తికమకపడుతూ ఆఖరికి ఎటూ తేల్చుకోలేక ఎందుకైనా మంచిది అని నిశ్శబ్దం పాటిస్తున్నారు.
ఓ విధంగా హిందూపురం విషయమై చంద్రబాబుకు, చినబాబు అయిన లోకేశ్ కు మధ్య ఓ చిన్న పాటి చర్చ అయితే జరిగిందని కూడా సమాచారం. ఇదే సందర్భంలో మాస్ లీడర్ గా ఎదిగిపోతున్న బాలయ్య విషయమై పార్టీలోనూ ముఖ్య నేతల మధ్య చిన్న పాటి యుద్ధమే నడుస్తోంది. ఆ తరహా యుద్ధం చంద్రబాబు మరియు లోకేశ్ మధ్య కూడా జరిగిందనే సమాచారం. జనాలను ఆకట్టుకోవడంలో మరియు రెచ్చగొట్టడంలో బాలయ్య పొలిటికల్ స్టామినా పెరిగితే, పబ్లిక్ లో ఆయన ఇమేజ్ మరింత పెరిగితే చంద్రబాబుకే కష్టం అని ఇంకొందరు పరిశీలకులు సెటైర్లు వేస్తున్నారు.